
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ నాయకురాలు కవిత సస్పెన్షన్ వెనుక పార్టీ అంతర్గత పరిణామాలు వేడెక్కుతున్నాయి. కేసీఆర్ తన కుమార్తె వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నేతలతో చర్చల అనంతరం కఠిన నిర్ణయం తీసుకున్నారని వర్గాలు చెబుతున్నాయి.
సమావేశంలో కేసీఆర్, “కవితకు నేనేం తక్కువ చేశాను? ఎంపీ, ఎమ్మెల్సీ అవకాశాలు ఇచ్చాను. మద్యం కేసులో చిక్కుకున్నప్పుడు పెద్ద లాయర్లతో పోరాడాను. అయినా పార్టీకి నష్టం కలిగించేలా ఎందుకు ప్రవర్తించింది?” అంటూ ఆవేదనతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కొంతమంది నేతలు కవిత రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నారని, ఆయన సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారని కేసీఆర్ ముందు ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణ కాపాడాలంటే కవితపై చర్య తప్పదని వారు అభిప్రాయపడ్డారు.
సస్పెన్షన్ తర్వాత కవిత కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఆమెకు మంత్రి పదవి కూడా రావచ్చని నేతలు ఊహించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ, “ఆమెకు మంత్రి పదవి వస్తే మనకే లాభం” అని చెప్పినట్టు సమాచారం.
కుటుంబం కంటే పార్టీని ప్రాధాన్యంగా చూసే తీరును ఈ చర్య ద్వారా కేసీఆర్ చూపించారని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సందేశం ఆయన స్పష్టంగా ఇచ్చారు.
అంతిమంగా, కవితపై వేటు కేసీఆర్‌కు వ్యక్తిగతంగా బాధ కలిగించినా, రాజకీయంగా మాత్రం పార్టీ ఐక్యతను కాపాడే నిర్ణయంగా కనిపిస్తోంది.