
న్యూస్ డెస్క్: భారత్‌లో తయారైన అతి చిన్న చిప్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్పును తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం ‘ఇండియా సెమీకాన్ 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా వచ్చినా, ఇప్పుడు భారత పురోగతిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మోదీ మాట్లాడుతూ, 20వ శతాబ్దంలో పెట్రోల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిందని, 21వ శతాబ్దంలో చిన్న చిప్‌లే భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. “చమురు బావుల మీద ఆధారపడిన రోజులు ముగిశాయి. ఇప్పుడు ఆర్థిక శక్తి ఒక చిన్న చిప్‌లో ఇమిడిపోయింది. ఇది ప్రపంచ ప్రగతికి బలమైన పునాది” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి 40కి పైగా దేశాల ప్రతినిధులు హాజరైన విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ, ఇది భారత యువ శక్తి, ఆవిష్కరణలపై ప్రపంచ నమ్మకానికి నిదర్శనమని అన్నారు. “ప్రపంచం భారత్‌తో కలిసి సెమీకండక్టర్ భవిష్యత్తును నిర్మించేందుకు సిద్ధంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లుగా ఉందని, రాబోయే కాలంలో ఇది 1 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని మోదీ చెప్పారు. ఈ పెరుగుదల కారణంగానే పెట్టుబడిదారులు భారత్ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన వివరించారు.
భవిష్యత్తులో ‘డిజైన్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా’ అన్నదే భారత్ గుర్తింపుగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు. రెండో దశ సెమీకండక్టర్ మిషన్‌పై ఇప్పటికే దృష్టి పెట్టామని, తాత్కాలిక ప్రయోజనాలకే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని ప్రధాని స్పష్టం చేశారు.
