
న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌ను సుదీర్ఘంగా కొనసాగించేందుకు, ముఖ్యంగా టెస్టులు, 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టార్క్ ప్రకటించాడు.
మరో ఆరు నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ప్రకటన చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఆస్ట్రేలియాకు భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, దక్షిణాఫ్రికా టూర్, వన్డే ప్రపంచకప్ వంటి కీలక సిరీస్‌లు ఉన్నాయని స్టార్క్ పేర్కొన్నాడు.
ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమే కాకుండా, తన శక్తి మొత్తాన్ని టెస్టులు, వన్డేలలో వినియోగించాలని భావించినట్లు వివరించాడు. “2021 టీ20 ప్రపంచకప్ గెలవడం నా కెరీర్‌లో మరపురాని జ్ఞాపకం. అయితే నా ప్రాధాన్యం ఎప్పుడూ టెస్టు క్రికెట్టే” అని స్టార్క్ స్పష్టం చేశాడు.
స్టార్క్ టీ20 కెరీర్‌లో 65 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఆసీస్ తరఫున ఈ ఫార్మాట్‌లో ఆడం జంపా తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
స్టార్క్ నిర్ణయంపై సెలెక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ స్పందిస్తూ అతన్ని ప్రశంసించారు. “మిచ్ ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు విజయాలు అందించాడు. టెస్టులు, వన్డేలపై దృష్టి పెట్టడం సరైన నిర్ణయం” అని అన్నారు.
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన రోజే స్టార్క్ తన రిటైర్మెంట్ ప్రకటించడం విశేషంగా నిలిచింది.
