న్యూస్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ ఇటీవల కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బహిరంగ మద్దతు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిచిన సిపి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జగన్‌ను సంప్రదించగా, ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇప్పటి వరకు జగన్ తటస్థంగా వ్యవహరించారని భావించిన ఎన్డీయే నేతలు, ఈసారి ఆయనను నేరుగా సంప్రదించటం కొత్త చర్చలకు దారితీసింది. ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే టీడీపీ బలమైన మిత్రపక్షంగా ఉండగా, కేంద్రం జగన్‌ను సంప్రదించడమే రాజకీయంగా సెన్సేషన్ అయింది.
ఈ విషయంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం చంద్రబాబుకు సమాచారం ఇవ్వకుండా జగన్‌తో మాట్లాడటం సరికాదని వారు అంటున్నారు. కేంద్రంలో టీడీపీ మద్దతు కీలకమని తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అనుమానాస్పదమని భావిస్తున్నారు.
ఇక జగన్‌కు ఇప్పుడు పెద్ద రాజకీయ బలం ఏమీ లేకపోయినా, ఆయనను కేంద్ర నేతలు సంప్రదించడం వెనుక వేరే లెక్కలున్నాయా అన్న సందేహం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లిక్కర్ కేసుల్లో జగన్‌పై చర్యలు నిలిచిపోవడం ఈ పరిణామాలకు సంబంధం ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఈ మద్దతు టిడిపిలో కలవరం రేపింది. దీనిపై చంద్రబాబు ఎలాంటి స్పందన ఇస్తారో, కేంద్రంలోని పెద్దలతో చర్చిస్తారో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.