
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన సంఘటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. శ్రీశైలం ప్రాంతంలో అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో జనసేన కీలక నేత పేరు రావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చి చట్టపరమైన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అటవీ ప్రాంతంలో పర్యటించారు. రాత్రివేళ ప్రవేశం నిషేధమని అటవీ సిబ్బంది ఆపే ప్రయత్నం చేయగా, ఆయన సిబ్బందితో కలిసి వారిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో సిబ్బందిని నిర్బంధించి వాహనాన్ని దుర్వినియోగం చేసినట్లు కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి.
దీని పై విచారణ జరిపిన పోలీసులు, ప్రధాన నిందితుడిగా శ్రీశైలం జనసేన ఇన్‌ఛార్జ్ అశోక్ రౌత్‌ను గుర్తించారు. అలాగే ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కేసు నమోదు కోసం పవన్ కళ్యాణ్ అనుమతి కోరగా, ఆయన వెంటనే సమ్మతించారు.
అటవీ శాఖ సిబ్బంది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలసి తమ బాధను తెలియజేశారు. దీనిపై స్పందించిన పవన్, “నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు సమానమే. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
ఈ పరిణామంతో పాలక కూటమి ప్రభుత్వం చట్టాన్ని సమానంగా అమలు చేస్తోందనే సందేశం వెలువడింది. అదే సమయంలో జనసేనలో అంతర్గత క్రమశిక్షణపై పవన్ కళ్యాణ్ చూపిన కఠిన వైఖరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
