
న్యూస్ డెస్క్: రాజకీయాల్లో అనుసరణ సహజం. ఒక పార్టీ చేపట్టిన వ్యూహం తమకు అనుకూలమని అనిపిస్తే, మరొక పార్టీ కూడా అదే దారిలో నడుస్తుంది. తాజాగా వైసీపీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అక్రమ ఓటింగ్, ఒకే ఇంటి నంబరుతో వేల ఓట్లు, ఒకే పేరుతో పలు ఓట్లు వేసినట్టు ఆరోపిస్తున్నారు. కర్నాటకలో జరిగిన ఓటింగ్‌పై ఆయన వివరాలు ప్రజెంటేషన్ రూపంలో ఇచ్చారు.
ఇప్పుడు జగన్ కూడా ఇదే పద్ధతిని అనుసరించనున్నారని సమాచారం. గత ఎన్నికల తర్వాత ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఒంగోలు అభ్యర్థి బాలినేని మాత్రమే అప్పట్లో ఫిర్యాదు చేశారు.
రాహుల్ ప్రజెంటేషన్ చూసిన తరువాత జగన్ కూడా ఏపీలో జరిగిన ఎన్నికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కోసం మద్రాస్ ఐఐటీకి చెందిన ఎన్నికల నిపుణుడితో పాటు మస్తాన్ రావును నియమించుకుని అధ్యయనం చేయాలని వైసీపీ నిర్ణయించింది. ముఖ్యంగా 50 వేల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించనున్నారు.
“జరిగిన దానికి మేం ఏం చేయలేం. కానీ ఈ అధ్యయనం ద్వారా ఈవీఎంలను మానుకోవాలని, తప్పులను ప్రజలకు వివరించాలని భావిస్తున్నాం” అని పార్టీ కీలక నేత తెలిపారు. ప్రస్తుతం జగన్ ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.
