
ఓ మహిళ ఇంటికి వెళ్లి పింఛను అందించిన చంద్రబాబు
న్యూస్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ వేడుకలు జరుగుతున్న ఈరోజు, వైఎస్సార్ కడప జిల్లా గూడెంచెరువు గ్రామం ఒక ప్రత్యేక దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారు ఉల్సాల అలివేలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛన్ అందించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, వారి సమస్యలను వినడం ద్వారా ప్రజలకు చేరువగా ఉండే నాయకుడిగా మరోసారి గుర్తింపు పొందారు.
అలివేలమ్మ పెద్ద కుమారుడు వేణుగోపాల్ ఒక చేనేత కార్మికుడు. సీఎం ఆయన మగ్గాన్ని పరిశీలించారు. అలాగే, హర్షవర్ధన్ అనే చిన్నారి ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుడని తెలియజేశారు. చిన్న కుమారుడు జగదీశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న విషయం కూడా సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం జగదీశ్ ఆటోలోనే ప్రయాణించి ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో జగదీశ్ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు ఎలా చేరుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి చంద్రబాబు ఈ విధంగా పర్యటించారు. ఇంటివద్దే పింఛన్ అందించడం గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తింది.