
ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఇటీవల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం ఉదయం షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో జరిగిన సమావేశంలో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆరోగ్య, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమికండక్టర్స్, పోర్టులు, పరిశ్రమల రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
శిల్పక్ అంబులే మాట్లాడుతూ, సింగపూర్‌తో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయని, సీబీఎన్ బ్రాండ్‌కు అక్కడ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. గతంలో అమరావతి ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న సింగపూర్ కొన్ని కారణాల వల్ల వైదొలిగిందని వివరించారు. అయినప్పటికీ, ఏపీలో పెట్టుబడులకు అక్కడి సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు మాట్లాడుతూ, కొత్త పాలసీలు పెట్టుబడులకు మార్గం సుగమం చేశాయని, గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, రాయలసీమలో డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ రాష్ట్రంలో చేపడుతున్న భారీ ప్రాజెక్టులను వివరించగా, మంత్రి లోకేశ్ విద్యారంగంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్ రంగాల్లో పెట్టుబడులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రతినిధుల బృందానికి అక్కడి పారిశ్రామిక వర్గాల్లో మంచి ఆదరణ లభించిందని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో పెట్టుబడులపై ఈ పర్యటన కీలకంగా నిలవనుంది.
