
న్యూస్ డెస్క్: భారత స్టాక్ మార్కెట్ బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో హై లెవెల్ అస్థిరతను ఎదుర్కొంది. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ కుదురుతుందా? అనే అనిశ్చితి మార్కెట్‌ను ప్రభావితం చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు ట్రేడింగ్ రోజంతా ఊగిసలాట కనిపించింది.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 143 పాయింట్ల స్వల్ప లాభంతో 81,481 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మొదట మంచి గ్యాప్-అప్ ఇచ్చినా, తరువాత పెట్టుబడిదారుల మిశ్రమ స్పందనతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రా డేలో 81,618 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 33 పాయింట్లు పెరిగి 24,855 వద్ద స్థిరపడింది.
ఈ సెషన్‌లో ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతి సుజుకి లాంటి షేర్లు లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు జరుగగా, ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫలితాల తర్వాత ఒత్తిడిగా మారింది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు స్వల్పంగా తగ్గినా, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభాల్లో నిలబడ్డాయి. రూపాయి విలువ ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్కెట్ ముందుగా మరింత స్పష్టత కోసం ట్రేడర్లు వేచి చూస్తున్నారు.
