
న్యూస్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమవుతోంది. నటుడు విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని నేడు తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) తరఫున మొదటి ప్రచార యాత్రను ప్రారంభించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన తిరుచ్చి నుంచి ఈ యాత్ర మొదలవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అరియలూరులో జరిగే భారీ సభలో విజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ యాత్ర కోసం ప్రత్యేక ప్రచార వాహనం సిద్ధం చేశారు. భద్రతా కారణాల వల్ల పోలీసులు 25 కఠిన నిబంధనలు విధించారు. రోడ్ షోలు, వాహన కాన్వాయ్‌లపై పరిమితులు అమలు చేస్తూ, సభలో పాల్గొనేవారి కోసం పార్టీకి బాధ్యతలు అప్పగించారు.
తిరుచ్చిని ఎంచుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎంజీఆర్, అన్నాదురై వంటి నేతలు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇదే ప్రాంతంలోనే ఉండటంతో విజయ్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం ప్రత్యేకతను తెచ్చింది.
ప్రచార బస్సుపై పార్టీ నినాదాలు, పోస్టర్లు ఇప్పటికే ఆసక్తి రేపుతున్నాయి. ‘మీ విజయ్.. నేను విఫలం కాను’ అనే స్లోగన్ ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పటినుంచో సినీ తారల ప్రభావం ఉందని తెలిసిందే. ఇప్పుడు విజయ్ కూడా ఆ బాటలో ముందుకు రావడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
ఈ ప్రారంభ యాత్ర విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఎంత బలాన్నిస్తుందో, రానున్న 2026 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.