
ఏపీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అవుతోందని మండిపడ్డారు. పేదల ప్రాణాలను కాపాడే ఈ పథకాన్ని “అనారోగ్యశ్రీ”గా మార్చేశారని ఆమె ఆరోపించారు.
ఆసుపత్రులకు ఏడాదిన్నరగా రూ.2500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే ప్రభుత్వ ఉద్దేశాన్ని చూపుతోందని ఆమె అన్నారు. దీని వెనుక యూనివర్సల్ ఇన్సూరెన్స్ పేరుతో మోసం దాగి ఉందని షర్మిల పేర్కొన్నారు.
ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్న చంద్రబాబు, ఇప్పుడు కేవలం రూ.2.5 లక్షలకు కుదించారని ఆమె విమర్శించారు. ఇది పేదలపై పెద్ద మోసం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ బీమాతో ఆరోగ్యశ్రీని ముడిపెట్టడం ప్రజారోగ్యానికి పెద్ద ప్రమాదమని ఆమె హెచ్చరించారు. దేశంలోని పలు రాష్ట్రాలు మళ్లీ ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మళ్ళాయని గుర్తు చేశారు.
ఆసుపత్రులపై పెండింగ్ ఉన్న రూ.2500 కోట్లను వెంటనే చెల్లించాలని, ఆరోగ్యశ్రీ సేవలను తక్షణం పునరుద్ధరించాలని షర్మిల డిమాండ్ చేశారు.
ప్రజారోగ్యంపై రాజకీయాలు ఆడొద్దని, పేదలకు ఉపశమనం కలిగించేలా ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలంటూ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి హితవు పలికారు.
