
యానిమేషన్ చిత్రంగా వచ్చిన మహావతార్ నరసింహ బాక్సాఫీస్ ను ఊహించని విధంగా షేక్ చేస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా, కేవలం పాజిటివ్ మౌత్ టాక్‌తోనే థియేటర్లను హౌస్‌ఫుల్ చేస్తున్న విధానం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
విడుదలైన 10వ రోజుకు హైదరాబాద్‌లో ఈ చిత్రం రూ.1.4 కోట్లు గ్రాస్ వసూలు చేయగా, అదే సమయంలో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వసూళ్లు రూ.98 లక్షల వద్దే నిలవడం సినిమాపై హైప్‌ను సూచిస్తోంది. బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫామ్‌లో గంటకు 11 వేల టికెట్లు అమ్ముడవుతుండటం సినిమాకు ఎంత క్రేజ్ ఉందో చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ₹70 కోట్లు గ్రాస్ దాటిన ఈ చిత్రం, త్వరలోనే ₹100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్నది ట్రేడ్ టాక్. ఇంత వరకు ఏ యానిమేషన్ మూవీకి రాలేని స్థాయిలో వసూళ్లు రావడం చిత్ర ప్రత్యేకత.
ఈ విజయంలో దర్శకుడు అశ్విన్ కుమార్ ఇంటర్వ్యూలు కూడా కీలకంగా మారాయి. ప్రమోషన్ లేకుండానే విజయం సాధించడంతో, కంటెంట్ మేటైందని మరోసారి స్పష్టమవుతోంది.
ఇప్పట్లో ఈ ఉగ్రనరసింహుడి వీరంగం ఆగేలా కనిపించడం లేదు. కూలీ, వార్ 2 వచ్చేదాకా బాక్సాఫీస్‌ను ఈ చిత్రం హైజాక్ చేయడం ఖాయమన్న అభిప్రాయమే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.