
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై తీవ్రంగా స్పందించిన ఆయన, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రైతులకు యూరియా దొరకక ఇబ్బంది పడుతున్నారని, భూముల విలువలు పడిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల విషయంపై ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెబుతున్నారని, అధికారులే రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
రుణమాఫీ అంశంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు నిలిపివేయబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ అంటేనే రేవంత్ రెడ్డికి భయం ఎక్కువగా ఉందని, అందుకే తరచుగా కేసీఆర్ పేరే ఢిల్లీలో ప్రస్తావిస్తున్నారని అన్నారు. తమ పాలనలో జరిగిన మంచి పనులను ప్రజలకు చెప్పడంలో కార్యకర్తలు విఫలమయ్యారని, అదే ఓటమికి కారణమని తెలిపారు.
మళ్ళీ కేసీఆర్ ను సీఎం చేయాలంటే అందరం కలిసికట్టుగా కృషి చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
