న్యూస్ డెస్క్: బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా నేతలు పాల్గొన్నారు.
బీసీల హక్కుల కోసం పోరాటాన్ని తీవ్రంగా ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలకు తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.
బీసీ బిల్లుపై అసెంబ్లీలోనే చర్చ జరిగి ఉంటే సమస్యలే ఉండేవి కావని, ఇప్పుడు బిల్లు ఆమోదం పొందాక ముస్లింల పేరుతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. కిషన్ రెడ్డిని బహిరంగ చర్చకు సవాల్ విసిరినట్టు తెలిపారు.
బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీల ఓట్లను కోల్పోయిందని, రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే మళ్లీ ఓటమి తప్పదని పొన్నం అన్నారు. కేంద్రానికి తగిన బుద్ధి చెప్పేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ధర్నా మౌదానంలో కాంగ్రెస్ నేతల కట్టుదిట్టమైన ఐక్యత కనిపించింది. బీసీల సమస్యపై కాంగ్రెస్ పార్టీ చివరి వరకూ పోరాడుతుందని హామీ ఇచ్చారు.
