
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితగాథ ఆధారంగా రూపొందుతున్న మా వందే సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఉన్నీ ముకుందన్ మోదీ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
మా వందే సినిమాను వీర్ రెడ్డి ఎం నిర్మిస్తుండగా, క్రాంతి కుమార్ సి.హెచ్. దర్శకత్వం వహిస్తున్నారు. పోస్టర్లు విడుదల కావడంతోనే మోదీ బాల్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రయాణం ఎలా చూపించబోతున్నారో అన్న అంచనాలు పెరిగాయి.
సినిమాలో మోదీ గారి తల్లి హీరాబెన్‌తో ఉన్న అనుబంధం భావోద్వేగంగా చూపించబోతున్నట్లు సమాచారం. తల్లి విలువలు, ఆచారాలు ఆయన నాయకత్వ శైలిపై చూపిన ప్రభావాన్ని సహజంగా ప్రతిబింబించనున్నారని మేకర్స్ తెలిపారు.
టాప్ టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తోంది. కెమెరా వర్క్‌కి కె.కె. సెంథిల్‌కుమార్, ఎడిటింగ్‌కి శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్‌కి సాబు సిరిల్ పనిచేస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా, యాక్షన్ మాస్టర్ సోలమన్ ప్రత్యేక యాక్షన్ సన్నివేశాలను రూపకల్పన చేస్తున్నారు.
ఈ బయోపిక్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు మరికొన్ని భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు.