
న్యూస్ డెస్క్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మళ్లీ రాజకీయ ఉత్కంఠకు వేదికైంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకేరోజు వేర్వేరు కార్యక్రమాలు పెట్టుకోవడంతో పట్టణం మొత్తం టెన్షన్ వాతావరణంలోకి జారుకుంది.
హైకోర్టు అనుమతి పొందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలో అడుగుపెట్టనున్నారు. యల్లనూరు నుంచి ఉదయం 10 గంటల తర్వాత ఆయనను పోలీసులు స్వయంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే చర్యలు తీసుకోవాలని కూడా న్యాయస్థానం సూచించింది.
ఇక మరోవైపు, ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున కార్యకర్తలను రప్పించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఉద్రిక్తత తలెత్తే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేసి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
అయితే, జేసీ వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేడుక జరుగుతుందని పట్టుబడుతోంది. దీంతో రెండు వర్గాలు ఒకేసారి కార్యక్రమాలు నిర్వహిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందనే భయంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పట్టణంలో నిఘాను పెంచుతూ శాంతిభద్రతల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.