
న్యూస్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు పై చర్చలు మళ్లీ ముదురుతున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న ఈ పార్టీ, గత ఎన్నికల ఓటమి తర్వాత గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
గతంలో కేసీఆర్ కుటుంబం పార్టీపై పటిష్టమైన పట్టు కలిగి ఉండగా, ఇప్పుడు ఆ పట్టు సడలుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిజెపిలో చేరడం, తన రాజీనామా లేఖలో కేటీఆర్ పై చేసిన విమర్శలు పార్టీ అంతర్గత సమస్యలను బహిర్గతం చేశాయి.
బాలరాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వ్యక్తిగత దాడులు చేయడం, కుటుంబ సభ్యులపై కూడా కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారి తీసింది. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో ప్రతికూల భావనను కలిగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రజా ఉద్యమాలను నడపలేకపోవడం కూడా పార్టీ బలహీనతగా చెప్పబడుతోంది. సమావేశాలు, సభలతో మాత్రమే పరిమితం కావడం వల్ల ప్రజల నమ్మకం దెబ్బతిందని భావిస్తున్నారు.
అదే సమయంలో, కుటుంబ అంతర్గత విభేదాలు కూడా స్పష్టంగా బయటపడుతున్నాయి. కవిత నుంచి కేటీఆర్‌కి కౌంటర్లు రావడం, పార్టీ ఏకీకృత దిశలో సాగడంలో అడ్డంకులు కలిగిస్తోంది.
స్పష్టమైన వ్యూహం లేకుండా బీఆర్ఎస్ ముందుకు సాగడం కష్టమని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ గ్రాఫ్ దిగజారుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
