
న్యూస్ డెస్క్: భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిల మధ్య పోటీ ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేది. మైదానంలోనే కాదు, బయట కూడా వారిద్దరి మధ్య మాటల తూటాలు నడిచేవి. తాజాగా పఠాన్ ఒక పాత సంఘటనను గుర్తు చేసుకుంటూ అఫ్రిదిని ఒక్క మాటతోనే సైలెంట్ చేసిన విషయాన్ని వెల్లడించాడు.
2006లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని పఠాన్ చెప్పాడు. “అప్పుడు అఫ్రిది నన్ను ఎగతాళి చేస్తూ జుట్టు చెదరగొట్టి ‘ఏంటి పిల్లాడా.. ఎలా ఉన్నావ్?’ అని అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది” అని పఠాన్ వివరించాడు.
ఆ సమయంలో అఫ్రిది తనపై మరికొన్ని వ్యాఖ్యలు చేశాడని, దాంతో తనకు బాగా చిరాకు వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. పక్కనే కూర్చున్న పాక్ ఆటగాడు అబ్దుల్ రజాక్‌తో మాట్లాడుతూ “ఇక్కడ ఎలాంటి మాంసం దొరుకుతుంది?” అని కావాలనే బిగ్గరగా అడిగానని చెప్పాడు.
రజాక్ జంతువుల మాంసం దొరుకుతుందని చెప్పినప్పుడు, “మరి కుక్క మాంసం దొరుకుతుందా?” అని ప్రశ్నించానని పఠాన్ తెలిపాడు. వెంటనే అఫ్రిది వైపు చూస్తూ “ఇతను కుక్క మాంసం తిన్నట్లున్నాడు.. అందుకే ఇంతగా అరుస్తున్నాడు” అన్నానని గుర్తు చేసుకున్నాడు.
ఈ మాట విన్న వెంటనే అఫ్రిది ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడని, మళ్లీ తనతో ఎప్పుడూ గొడవకు దిగలేదని పఠాన్ వ్యాఖ్యానించాడు. “అప్పుడు నుండి అతను మాటల యుద్ధం చేయడానికే భయపడ్డాడు” అని పేర్కొన్నాడు.