
న్యూస్ డెస్క్: అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో బంగారంపై నెలకొన్న సందిగ్ధతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి విరామం పెట్టారు. బంగారం దిగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండబోవని స్పష్టంగా ప్రకటించారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ట్రూత్ సోషల్”లో “బంగారంపై సుంకాలు ఉండవు” అనే స్పష్టమైన సందేశం పోస్ట్ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఊహాగానాలు ముసురుకున్న పసిడి మార్కెట్ కాస్త స్థిరపడింది.
ఇటీవల స్విట్జర్లాండ్ నుంచి వచ్చే గోల్డ్ బార్స్‌పై అమెరికా సుంకాలు విధించవచ్చన్న వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా 1 కిలోగ్రాం, 100 ఔన్సుల బార్స్ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్, ఆభరణాల తయారీ, పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. సుంకాలు విధిస్తే ధరలు పెరిగే అవకాశం ఉందని, సరఫరా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించారు.
స్విస్ తయారీదారుల సంఘం కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ నేరుగా జోక్యం చేసుకొని, స్పష్టతనిచ్చి, మార్కెట్ వర్గాలకు ఊరట కల్పించారు.
ఇదే సమయంలో చైనాతో వాణిజ్య సంబంధాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌ల గడువును 90 రోజుల పాటు పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు త్వరలో ముగియాల్సి ఉంది.
ట్రంప్ నిర్ణయాల ప్రభావం బంగారం, వాణిజ్య రంగాలపై తక్షణమే కనిపించడం మొదలైంది. పెట్టుబడిదారులు, దిగుమతిదారులు ఈ చర్యలను సానుకూలంగా స్వాగతిస్తున్నారు.
