
న్యూస్ డెస్క్: అమెరికా మరియు పాకిస్థాన్ మధ్య ఇటీవల కుదిరిన రేర్ ఎర్త్ మినరల్స్ ఒప్పందం ఆసియా రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ ఒప్పందం కింద అమెరికన్ సంస్థ “US Strategic Metals” పాకిస్థాన్‌లో ఖనిజాల తవ్వకాలు, ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
పాకిస్థాన్ ప్రజలు, ప్రతిపక్షాలు ఈ డీల్‌ను “రహస్య ఒప్పందం”గా పరిగణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తమ దేశ ఖనిజ సంపద అమెరికాకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. PTI పార్టీ దీనిపై పారదర్శక దర్యాప్తు కోరింది.
ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత రేర్ ఎర్త్ మినరల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. చైనా ఆధారాన్ని తగ్గించుకునేందుకు ఈ డీల్ కీలక అడుగుగా చూస్తున్నారు అమెరికా వ్యూహకర్తలు. అయితే ఈ పరిణామం భారత్‌కు కొత్త భద్రతా సవాళ్లు తీసుకురావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఒప్పందం ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. భవిష్యత్‌లో అమెరికా పాక్ సంబంధాలు బలపడితే, దాని ప్రభావం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలపై పడే అవకాశం ఉంది.