
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమను విస్తరించే ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో ఆయన త్వరలోనే భేటీ కానున్నారన్న టాక్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం చిరంజీవి విదేశాల్లో ఉన్నా, తిరిగొచ్చిన వెంటనే అమరావతి లేదా హైదరాబాదులో చర్చ జరగవచ్చని సమాచారం వస్తోంది.
చర్చలో ప్రధాన అంశం రాష్ట్రంలో సినీ పరిశ్రమకు కొత్త అవకాశాలు కల్పించడం. ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన తెలుగు సినిమా ఇండస్ట్రీని విశాఖ, అమరావతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ప్రత్యేకంగా స్టూడియోలు, లొకేషన్లు, సౌకర్యాల కోసం ప్రభుత్వం సహకరించనుందని చెప్పబడుతోంది.
ఇక పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పించిన తర్వాత సినిమాల చిత్రీకరణలు పెట్టుబడులను రాబట్టగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ కారణంగానే మెగా కుటుంబం నుంచి ఉన్నత స్థాయి చర్చ అవసరం అని భావించి భేటీ ఆలోచనలో ఉన్నారని వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కూడా 2014, 2019 మధ్య సినీ ప్రముఖులతో చంద్రబాబు సమావేశమై అమరావతిలో స్టూడియోలు నిర్మించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇప్పుడు మరోసారి ఆయన ప్రయత్నం ముమ్మరమవుతుందని తెలుస్తోంది.
రాజకీయ పరంగా కూడా ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, అనంతరం చిరంజీవి రాసిన లేఖ పెద్ద చర్చకు దారితీసాయి. ఈ నేపథ్యంలో చిరు చంద్రబాబు భేటీ కేవలం సినిమా అభివృద్ధిపైనే కాకుండా రాజకీయ పరిణామాలపై కూడా చర్చకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
