
న్యూస్ డెస్క్: ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నారుల మరణాల ఘటనలతో దగ్గు సిరప్ వినియోగం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పలు సంస్థలతో కలిసి విస్తృత దర్యాప్తు ప్రారంభించింది.
ప్రాథమిక పరిశీలనలో సేకరించిన సిరప్ నమూనాల్లో డైథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలిన్ గ్లైకాల్ (EG) వంటి ప్రమాదకర రసాయనాలు లేవని తేలింది. ఇవి ఉంటే కిడ్నీ సమస్యలకు కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే మరణించిన చిన్నారి శరీర నమూనాల్లో లెప్టోస్పైరోసిస్ అనే ఇన్ఫెక్షన్ కనిపించడం దర్యాప్తును మరో వైపు మలిచింది.
అయినా కూడా పిల్లలకు దగ్గు సిరప్‌ల వినియోగంపై కేంద్రం జాగ్రత్త సూచనలు జారీ చేసింది. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు పూర్తిగా ఇవి ఇవ్వకూడదని, ఐదు సంవత్సరాల లోపు వారికి కూడా సాధారణంగా సిఫార్సు చేయరాదని స్పష్టం చేసింది. అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో మాత్రమే ఇవ్వాలని సూచించింది.
రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఇప్పటికే 19 బ్యాచ్‌ల సిరప్ విక్రయాన్ని నిషేధించింది. ఆ సిరప్ సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సరఫరా అవుతున్నట్లు సమాచారం.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, పిల్లల్లో ఎక్కువగా దగ్గు జబ్బులు సహజంగానే తగ్గిపోతాయి. కాబట్టి తల్లిదండ్రులు అవసరం లేకుండా సిరప్‌లకు ఆసరా పడవద్దని సూచిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వైద్యుల సలహాతో మందులు వాడాలని అధికారులు చెబుతున్నారు.
