
న్యూస్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మళ్లీ విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి లాభాలు గడుస్తోందని, ఆ డబ్బుతో రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
భారత్ అధిక సుంకాల వల్ల అమెరికా ఉద్యోగాలు కోల్పోతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే, నవారో చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదిక ఎక్స్ తిప్పికొట్టింది.
కమ్యూనిటీ నోట్ ద్వారా “భారత్ తన ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం కాదు.
అంతేకాకుండా అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి భారత్‌ను విమర్శించడం ద్వంద్వ నీతి అవుతుంది” అని స్పష్టంగా పేర్కొంది.
ఈ పరిణామంతో నవారో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో ఇలా ఫ్యాక్ట్ చెక్ నోట్ జోడించడం పనికిమాలిన చర్య అని, ఎలాన్ మస్క్ ఎందుకు ఇలాంటి విషయాలకు అనుమతిస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం భారత్ ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవారో చేసిన వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాలపై మళ్లీ చర్చ రేపాయి.