
న్యూస్ డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను ఆకట్టుకునే దిశగా పెద్ద ప్లాన్ వేసింది. ఈ నెల 15న కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ’ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సభ ద్వారానే స్థానిక ఎన్నికల ప్రచారానికి శుభారంభం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్ వంటి జాతీయ నాయకులు సభకు హాజరుకానున్నారు.
లక్ష మందికి పైగా జనసమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, ఈ సారి బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని భావిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే వేదికపై గతంలో సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తూ 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదానికి పంపింది ప్రభుత్వం.
ఇలాంటి నేపథ్యంలో కామారెడ్డి వేదికపై విజయోత్సవ సభ పెట్టడం ద్వారా బీసీ వర్గాలకు బలమైన సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ వ్యూహం రూపొందించింది. ఈ సమావేశం రాబోయే స్థానిక ఎన్నికలపై పెద్ద ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు.
