
న్యూస్ డెస్క్: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో భయంకర ఘటన చోటు చేసుకుంది. క్రాషెనిన్నికోవ్ అనే అగ్నిపర్వతం 600 ఏళ్ల నిశ్శబ్దాన్ని చీల్చుతూ అకస్మాత్తుగా బద్దలైంది. ఈ భారీ విస్ఫోటనంతో 6 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద, ధూళి విరుచుకుపడింది.
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం అక్కడ వచ్చిన భారీ భూకంపమే ఈ పేలుడు పూర్వసూచన కావొచ్చని భావిస్తున్నారు.
అధికారికంగా విడుదలైన వివరాల ప్రకారం.. బూడిద తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రం వైపు ప్రవహిస్తోంది. అదృష్టవశాత్తూ, జనావాసాలు లేని మార్గం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే 7.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో కమ్చట్కా ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అయితే తీరప్రాంతాలకి జారీ చేసిన సునామీ హెచ్చరికలు అనంతరం ఉపసంహరించుకున్నారు.
కేవీఈఆర్‌టీ డైరెక్టర్ ఓల్గా గిరినా ఈ ఘటనను “చారిత్రక ఘట్టం”గా పేర్కొన్నారు. గతంలో అగ్నిపర్వతం 600 ఏళ్ల క్రితం బద్దలయ్యిందన్న సమాచారం ఉన్నా.. కొన్ని గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ రికార్డులు మాత్రం 475 ఏళ్ల క్రితం చివరి విస్ఫోటనం జరిగిందని పేర్కొంటున్నాయి. కాల గణనపై శాస్త్రవేత్తల అభిప్రాయాలు భిన్నంగా ఉండడం విశేషం.