
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు జీవో రాజకీయ రంగంలోనూ దుమారం రేపింది.
పవన్ సినిమాకు అధిక రేట్లు ఎందుకని వైసీపీ శ్రేణులు విమర్శిస్తుండగా, పవన్ అభిమానులు “పుష్ప-2కు కూడా ఇలాగే ఇచ్చారు కదా” అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.
ఓజీ విడుదల రోజున తెల్లవారుజామున 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి లభించింది. ఆ షో టికెట్ రేట్ జీఎస్టీతో కలిపి రూ.1000గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకునే వీలు కల్పించారు. ఈ రేట్లు అక్టోబర్ 4 వరకు అమల్లో ఉంటాయి.
ఇదే తరహా అనుమతులు గతేడాది పుష్ప 2కు కూడా ఇచ్చారు. బెనిఫిట్ షో టికెట్ రేటు అప్పుడూ జీఎస్టీతో రూ.1000కే ఫిక్స్ చేశారు. కానీ మల్టీప్లెక్స్‌లలో పుష్ప-2 రేట్లు మరింత ఎక్కువగా ఉండేవి. అంటే రెండు సినిమాలకు సమానమైన అనుమతులే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అయినా సామాన్య ప్రేక్షకుల దృష్టిలో ఈ రేట్లు భారంగా అనిపిస్తున్నాయి. సినిమా ఫ్యాన్స్ మాత్రం “పవర్ స్టార్ సినిమాకి అంత ఖర్చు చేస్తాం” అంటున్నారు. కానీ సాధారణ సినిమా ప్రేక్షకుల మధ్య చర్చ మాత్రం టికెట్ రేట్లపైనే కొనసాగుతోంది.