
న్యూస్ డెస్క్: ప్రతి పౌరుడి దేశభక్తిని న్యాయమూర్తులు నిర్ణయించలేరని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. సుప్రీంకోర్టు ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ ఆరోపణలకు ఆమె సమాధానం ఇచ్చారు.
దేశంలో న్యాయవ్యవస్థకు గౌరవం ఉన్నప్పటికీ, ఎవరు నిజమైన భారతీయుడో తేల్చే హక్కు వారికి లేదని తేల్చిచెప్పారు.
ప్రియాంక గాంధీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక ప్రతిపక్ష నేత బాధ్యత. మా సోదరుడు రాహుల్ గాంధీ సైన్యం పట్ల గౌరవంతో ఉన్నారు. ఆయన ఎప్పుడూ దేశ భద్రతా బలగాలను టార్గెట్ చేయలేదు” అని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు.
సైన్యం అంటేనే రాహుల్‌కు గౌరవం ఉందని, వారి సంక్షేమం కోసం అనేక ప్రశ్నలు అడిగారని ఆమె గుర్తు చేశారు. ఈ ప్రశ్నలను ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడానికే అడిగారని, అవి దేశభక్తిని కొలిచే ప్రమాణాలు కావు అన్నారు.
2019లో కూడా రాహుల్ గాంధీ పౌరసత్వంపై అనవసర ఆరోపణలు వచ్చాయని ప్రియాంక గుర్తు చేశారు. అప్పట్లోనే ఆమె గట్టిగా స్పందించారని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో నిలబడుతున్నారని చెప్పారు. “రాహుల్ ఇక్కడే పుట్టారు, ఈ మట్టి కోసమే పని చేస్తున్నారు. ఆయన భారతీయుడనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు” అన్నారు.