
తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది తెలుగు ఫిలిం ఛాంబర్. సినిమా రంగంలో పనిచేయాలనుకునే ప్రతిభావంతులకు ఇది శుభవార్తే. ఇప్పుడు నైపుణ్యం ఉన్నవారు యూనియన్ మెంబర్‌షిప్ లేకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పనిచేయవచ్చని ఛాంబర్ స్పష్టంగా ప్రకటించింది.
ఇటీవల సినీ కార్మిక సంఘాలు తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేయడంతో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమైంది.
వేతనాల విషయంలో చర్చ జరుగుతూనే ఉండగా, ఇందులో భాగంగా నైపుణ్యంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం వల్ల ఇండస్ట్రీకి కొత్త బలాన్నిచ్చే అవకాశం ఉంది. కొత్తవాళ్లు, టాలెంట్ ఉన్నవాళ్లు యూనియన్లలోకి చేరాల్సిన అవసరం లేకుండానే తమ ప్రతిభతో పనిచేసే అవకాశం పొందనున్నారు. ఇది ప్రత్యేకంగా చిన్న నిర్మాతలు, కొత్త టెక్నీషియన్లు, ఫ్రీలాన్స్ వర్కర్లకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది.
తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటనలో “నిర్మాతల కోసం, పరిశ్రమ భవిష్యత్ కోసం ఈ మార్పు తీసుకొచ్చాం. ఇది సరికొత్త దిశలో అడుగు” అని పేర్కొన్నారు. సినీ రంగం ఓపెన్ ప్లాట్‌ఫామ్‌గా మారితే, ఆరోగ్యకరమైన పోటీ పెరిగి, నాణ్యతా పనితనం మెరుగవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇందుకు తోడుగా, నిర్మాతలు కూడా కొత్త టాలెంట్‌తో పనిచేయడం వల్ల వ్యయభారం కొంత తగ్గుతుంది. అలా చేస్తే ఎక్కువ సినిమాలు తక్కువ బడ్జెట్‌లో తీయగలుగుతారు. అదే సమయంలో, కొత్తవాళ్లకు వారి ప్రతిభ చాటుకునే అవకాశం లభిస్తుంది.
