న్యూస్ డెస్క్: కడపలో జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఇటీవల సీబీఐ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టులో తెలియజేయగా, నిందితుల బెయిల్ రద్దుపై పిటిషన్ పెండింగ్‌లో ఉంది.
ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతా రెడ్డి కడప ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన వద్దకు ఒక లేఖ తీసుకువచ్చి, ‘‘ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టాలి’’ అని ఒత్తిడి తీసుకొచ్చారని సునీతా తెలిపారు. కానీ తాను అలా చేయలేదని స్పష్టం చేశారు.
పులివెందులలో రెండు రోజులుగా జరుగుతున్న ఉదంతాలు తండ్రి హత్యను గుర్తు చేస్తున్నాయని ఆమె అన్నారు. వివేకా గొడ్డలిపోటుతో హత్యకు గురై రక్తపు మడుగులో పడ్డారని, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచారని ఆమె ఆరోపించారు.
జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ కూడా పులివెందులలో టెన్షన్ నెలకొంది. తమ బంధువు సురేష్‌పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
ఆరేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నప్పటికీ, దోషులకు శిక్ష పడలేదని సునీత రెడ్డి వాపోయారు. తాను, తన భర్తపై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ, నేరవారికి తగిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
