న్యూస్ డెస్క్: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించారంటూ మదురోను అరెస్ట్ చేయడంలో సహకరిస్తే రూ.430 కోట్ల (50 మిలియన్ డాలర్లు) రివార్డును ప్రకటించింది.
గతంలో ట్రంప్ హయాంలో ఈ నజరానా 15 మిలియన్లుగా ఉండగా, బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక 25 మిలియన్ డాలర్లకు, ఇప్పుడు 50 మిలియన్లకు పెరిగింది.
ఈ విషయాన్ని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఎక్స్‌లో వీడియో ద్వారా ప్రకటించారు. మదురో డ్రగ్ మాఫియాలను అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి, హింసకు కారణంగా ఉపయోగిస్తున్నారని బాండీ ఆరోపించారు. ట్రెన్ డె అరాగువా, సినలో, కార్టల్ ఆఫ్ ది సన్స్ వంటి మాఫియా గ్రూపులతో మదురో అనుబంధం ఉందని వివరించారు.
ఇప్పటివరకు మదురోకు సంబంధించిన 7 టన్నుల కొకైన్, ఆయన సన్నిహితుల నుంచి 23 టన్నుల కొకైన్‌ను అధికారులు సీజ్ చేశారని చెప్పారు. అలాగే, ఫెంటెనిల్ స్మగ్లింగ్‌లో కూడా మదురో ప్రమేయం ఉందని వెల్లడించారు.
2020లో న్యూయార్క్ డిస్ట్రిక్ట్‌లో మదురోపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేట్ జెట్‌లు, 700 మిలియన్ డాలర్ల ఆస్తులు కూడా అమెరికా సీజ్ చేసినట్లు చెప్పారు.
అమెరికా చర్యలు వెనెజువెలా, మెక్సికో డ్రగ్ మాఫియా ఫైనాన్స్ పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.
