
న్యూస్ డెస్క్: హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ఒక్కరోజులోనే దూసుకెళ్లి నారా కుటుంబానికి భారీ లాభాలు తెచ్చాయి. గురువారం మార్కెట్ ఒడిదుడుకుల నడుమ FMCG సెక్టార్ బలంగా నిలిచింది. అందులో ముఖ్యంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ఇంట్రాడేలో 10% ఎగిసి రూ.540 వద్ద గరిష్టాన్ని తాకాయి.
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, “కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్” కారణంగా ఈ షేర్ ప్రైస్ భారీగా పెరిగింది. ఇది స్టాక్ మార్కెట్లో ధరలు మరింత ఎగబాకే సూచనగా భావిస్తారు. గత సెషన్‌లో రూ.488 వద్ద ముగిసిన షేర్, ఈసారి రూ.498 వద్ద ఓపెన్ అయి గగనానికి చేరింది.
ఈ పెరుగుదలతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్, దేవాన్ష్ కలిపి దాదాపు రూ.170 కోట్ల ఆస్తి పెంపు చూశారు. అందులో భువనేశ్వరి షేర్ల వల్ల ఒక్కరోజే రూ.117 కోట్లు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
బ్రాహ్మణికి రూ.2.2 కోట్ల లాభం, లోకేశ్ కు దాదాపు రూ.52 కోట్లు, దేవాన్ష్ కు రూ.29 లక్షల లాభం వచ్చింది. దీంతో మొత్తం కుటుంబానికి ఒక్కరోజులోనే కాసుల పంట పండింది.
ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ లో ప్రమోటర్ల వాటా 30% పైగానే ఉంది. చంద్రబాబుకు షేర్ల సంబంధం లేకపోయినా, కుటుంబ సభ్యుల పేర్లలో ఉన్న షేర్ల వల్లే ఈ భారీ లాభం నమోదు అయ్యింది.
స్టాక్ మార్కెట్ ఎప్పుడూ రిస్కీ అయినప్పటికీ, సరైన టైంలో సరైన స్టాక్స్ పెరగడం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.