
ఏపీ: రాజకీయాల్లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా మారిన రెడ్ బుక్ ఇప్పుడు హైలెట్ కావడం లేదు. మంత్రి నారా లోకేశ్ తన పాదయాత్ర సమయంలో వైసీపీ నేతలు, అధికారులు చేసిన అన్యాయాలన్నీ లిఖించామంటూ రెడ్ బుక్‌ను ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రారంభంలో ఆ జాబితాలో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు కేసులు ఎదుర్కొన్నారు. కొందరిని జైలుకు పంపించడమే కాకుండా, బందోబస్తు కూడా పెట్టారు. ఈ చర్యలతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం రెడ్ బుక్ ఊసే లేకుండా పోయింది.
సోషల్ మీడియాలోనూ ఈ విషయం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వైసీపీ నేతలు కూడా ఇకపై దానిపై విమర్శలు చేయడం లేదు. అంటే, ఆ జాబితా పూర్తిగా క్లియర్ అయిపోయిందా? లేక ప్రజల్లో నెగిటివ్ ఫీల్ రాకుండా జాగ్రత్త పడుతున్నారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
రెడ్ బుక్‌లో ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. కొందరికి ఇప్పటికీ పోస్టింగులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఇది కూడా ఒక విధంగా ఆ పుస్తకం వెనుక ఉన్న శక్తిని చూపిస్తోంది.
వైసీపీ మాత్రం రెడ్ బుక్ అసలు అమలు కాలేదని, అది కేవలం భయపెట్టే ప్రయత్నమేనని విమర్శిస్తోంది. అయితే టీడీపీ అంతర్గతంగా ‘చట్టబద్ధంగా’ చర్యలు తీసుకోవాలని, కానీ రెడ్ బుక్ పేరుతో మాట్లాడవద్దని సూచించినట్లు సమాచారం.
మొత్తానికి, ఒకప్పుడు రాజకీయాలను షేక్ చేసిన ఎర్ర పుస్తకం ఇప్పుడు మౌనంలో కలసిపోయింది. అది శాశ్వతంగా క్లోజ్ అయిందా? లేక మరో సరైన సమయం కోసం ఆగిపోతుందా? అన్నది చూడాలి.
