
తెలంగాణ: రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత, కేటీఆర్ మధ్య విభేదాలు మరింత బహిరంగమవుతున్నాయి. ఇప్పటికే కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్, ఇప్పుడు ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థ పగ్గాలు కూడా లాక్కోవాలని కదలికలు ప్రారంభించారు.
హైదరాబాద్‌లో రాజీవ్ సాగర్, రాజారాం యాదవ్, మఠం బిక్షపతి వంటి నేతలు మీడియా సమావేశం నిర్వహించి, జాగృతిపై కవితకు హక్కులేదని బహిరంగంగా ప్రకటించారు. తాము కూడా సంస్థ ఆవిర్భావంలో భాగమని, కేసీఆర్ ఆదేశాలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
కవిత రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే జాగృతిలో చీలిక రావడం గమనార్హం. ఇదే సమయంలో కేటీఆర్ ఎర్రవెలి ఫామ్ హౌస్‌లో తండ్రి కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు.
రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం, కేటీఆర్ వ్యూహం కవితను పూర్తిగా ఏకాకిని చేయడమే. ఇందులో భాగంగా జాగృతి కూడా పార్టీ ఆధీనంలో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
జాగృతి భవిష్యత్తు ఇప్పుడు బీఆర్ఎస్ నిర్ణయాలపై ఆధారపడి ఉండగా, కవిత పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.