
న్యూస్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కవిత సంచలన వ్యాఖ్యలతో హడావుడి నెలకొంది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ తనపై ఎన్నో కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. అయితే తాను మౌనం పాటించానని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వారిద్దరితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఘాటుగా విమర్శించారు.
హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో తన తండ్రి కేసీఆర్కు చెడ్డపేరు తెచ్చింది హరీశ్ రావు, సంతోష్, మేఘా ఇంజినీరింగే అని వ్యాఖ్యానించారు. “ఐదేళ్లు ఇరిగేషన్ శాఖను చూసిన హరీశ్ రావు బాధ్యత వహించరా? చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయిందని చెప్పడం అవాస్తవం” అని ఆమె ప్రశ్నించారు.
కవిత తన తండ్రి కేసీఆర్పై జరుగుతున్న సీబీఐ విచారణను వ్యక్తిగత అవమానంగా పేర్కొన్నారు. “నా నాన్న హిమాలయ పర్వతం లాంటి వ్యక్తి. ఆయనపై విచారణ జరిపినా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. పార్టీ ఉండకపోయినా, ఉండినా ఆయన పరువు శాశ్వతం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఆమె ఇంకా ముందుకు వెళ్లి, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. “బిల్లులు పెడతారు కానీ సుప్రీంకోర్టులో పోరాడే తపన కనబడటం లేదు. తెలంగాణ బీసీ బిడ్డలను బలి చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.