
న్యూస్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు గట్టి షాకిచ్చింది. నిబంధనలు పాటించని 474 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ నిర్ణయంతో మొత్తం 808 రిజిస్టర్ రాజకీయ పార్టీల గుర్తింపు రద్దయింది. వీటిలో కొన్నేళ్లుగా ఎన్నికల్లో పాల్గొనని, అవసరమైన డేటా సమర్పించని పార్టీలు ఉన్నాయని ఈసీ స్పష్టం చేసింది. రూల్స్ ను లైట్ తీసుకున్న పార్టీలను ఇకపై సహించబోమన్న సంకేతం ఇచ్చింది.
తాజా జాబితాలో ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది. అంతేకాదు, మరిన్ని పార్టీల గుర్తింపును కూడా త్వరలో రద్దు చేసే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి 17 పార్టీలు, తెలంగాణ నుంచి తొమ్మిది పార్టీలు గుర్తింపు కోల్పోయాయి. ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం దేశంలో గుర్తింపు లేని రిజిస్టర్ రాజకీయ పార్టీలు 2520గా ఉండగా, తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గింది. అంటే, రాజకీయ వాతావరణం క్రమంగా క్లియర్ అవుతోందన్న మాట.
మొత్తంగా చూస్తే.. ఇకపై పార్టీలు కఠినంగా నిబంధనలు పాటించకపోతే గుర్తింపే ప్రమాదమని ఈసీ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో మరింత కఠిన చర్యలు తప్పవని చెప్పొచ్చు.