
ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీలో శుక్రవారం కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ అంశాలపై చర్చ వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన ఆరోపణలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ కామెంట్స్ అసెంబ్లీని ఉత్కంఠభరితంగా మార్చాయి.
బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యంగా విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయమే లేదని ఆరోపించారు. ఫిర్యాదులకు స్పందించకుండా అధికారులు రాజకీయ సూచనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. “పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్టివ్‌గా పనిచేస్తోంది. కొన్ని కంపెనీలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశాం. కానీ ఒక్కో సంస్థను టార్గెట్ చేయడం సరైంది కాదు” అని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశ్రమల ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. కఠిన చర్యలతో అన్ని పరిశ్రమలు మూతపడితే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని పవన్ తెలిపారు.
ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మూడు నెలల్లో ఈ అంశంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మొత్తం మీద ఈ డిబేట్ అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. బోండా ఉమ ఆరోపణలు, పవన్ కళ్యాణ్ సమాధానాలు.. కాలుష్యం, పరిశ్రమల సమన్వయం అంశంపై కొత్త చర్చకు దారి తీశాయి.