
ఆంధ్రప్రదేశ్: మద్యం ప్రియులకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం బార్ల నిర్వహణ సమయాలను పొడిగిస్తూ కొత్త విధానాన్ని అమలు చేసింది. ఇకపై బార్లు ఉదయం 10 గంటల నుంచే తెరుచుకుని, అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే పనిచేసేవి. కానీ ఇప్పుడు కొత్త విధానం ప్రకారం రెండు గంటలు అదనంగా పెంచారు. దీంతో వినియోగదారులకు సౌలభ్యం కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ప్రకారం, ఈ కొత్త పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రాబోయే మూడేళ్ల పాటు, అంటే 2028 వరకు ఇది కొనసాగనుంది.
మరొక కీలక నిర్ణయంగా, రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో 10 శాతం లైసెన్సులు కల్లు గీత కులాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల వారికి ఆర్థికంగా ఉపయోగం కలుగుతుందని భావిస్తున్నారు.
మొత్తంగా, ఈ మార్పులు మద్యం ప్రియులకు గుడ్ న్యూస్‌గా మారగా, రాష్ట్రంలో బార్ యజమానులు కూడా సంతోషంగా స్వాగతించారు.