
స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టుల కారణంగా ఒక్కో సినిమా పూర్తి కావడానికి ఏళ్లు పడుతున్న ఈ రోజుల్లో, దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం తన స్పీడుతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన సినిమాలకు వేగంగా సెట్స్‌పైకి వెళ్లడమే కాదు, అంతే వేగంగా షూటింగ్ పూర్తి చేసుకోవడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.
ఈ ఏడాది ఉగాదికి పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ఇప్పటికే దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. చిరంజీవి, వెంకటేష్, నయనతార వంటి సీనియర్ స్టార్లతో కూడిన ఈ భారీ మల్టీస్టారర్ షూటింగ్ ఇంత వేగంగా జరగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రంలో మరో రెండు పాటలు, రెండు ఫైట్ సీక్వెన్సులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఆ మిగిలిన పాటల్లో ఒకటి చిరంజీవి, వెంకటేష్‌లపై చిత్రీకరించనున్న స్పెషల్ సాంగ్ కావడం విశేషం.
ఈ బ్యాలెన్స్ షూటింగ్‌ను కూడా త్వరలోనే పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు, ప్రమోషన్లపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేష్ సహజ నటనకు, అనిల్ రావిపూడి మార్క్ రైటింగ్ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతరే అని అంచనాలు పెరిగిపోతున్నాయి.
