
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు రాబడుతోంది.
అయితే సినిమా రిలీజ్ అయ్యి వారం గడుస్తున్నా, చిత్ర బృందం ప్రమోషన్ల జోరు తగ్గించడం లేదు. తాజాగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను వారణాసిలో సందడి చేశారు.
కాశీ ఎయిర్ పోర్టులో వీరిద్దరూ ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మార్కెట్ పై మరింత పట్టు సాధించేందుకే వీరు ఇప్పుడు కాశీ వెళ్లినట్లు సమాచారం. అక్కడ అఘోరాలను ప్రత్యేకంగా కలిసి, ఆ వీడియోల ద్వారా ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించాలనేది వీరి వ్యూహం.
రేపు విడుదల కాబోతున్న ‘అవతార్ 3’ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుండటంతో, ఆ గ్యాప్ ను వాడుకుని హిందీలో కలెక్షన్స్ పెంచుకోవాలని టీమ్ ప్లాన్ చేసింది.
బాలయ్య తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రిలీజ్ కు ముందే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లను కలవడం ఈ స్ట్రాటజీలో భాగమే. ఇప్పుడు అఘోరాలతో భేటీ ద్వారా సినిమాకు డివోషనల్ టచ్ ఇస్తూ, పోస్ట్ రిలీజ్ బజ్ ను పెంచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
