
కరూర్ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై టీవీకే అధినేత విజయ్ తొలిసారి స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ మాట్లాడుతూ.. “ప్రజల భద్రతే నా ప్రాధాన్యం. నన్ను టార్గెట్ చేయండి కానీ నా అభిమానులను టచ్ చేయవద్దు. ముఖ్యమంత్రి స్టాలిన్ సర్.. మీకు ఏదైనా రివేంజ్ ఉంటే నాపైనే చేయండి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
కాగా, ఈ ఘటనలో టీవీకే జిల్లా కార్యదర్శి మథియఝగన్ సహా పలువురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మలా శేఖర్ పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి.
విజయ్‌పై కూడా పరోక్షంగా కేసు నమోదయింది. షెడ్యూల్‌లో లేని ప్రాంతంలో ప్రసంగించడం, ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా ర్యాలీకి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అభియోగం మోపారు.
అయితే, విజయ్ మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. “పోలీసుల అనుమతితో సురక్షిత ప్రదేశంలోనే ర్యాలీ నిర్వహించాం. భద్రతా ప్రోటోకాల్స్ అన్నీ పాటించాం” అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు బాధితులను త్వరలోనే కలుస్తానని విజయ్ ప్రకటించారు.
