
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో (SSMB29) అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ముహూర్తం ఖరారైంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. రాజమౌళి తన స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమా విషయంలో చాలా గోప్యత పాటించడం ఉత్కంఠను మరింత పెంచింది.
ఇది కేవలం ప్రెస్ మీట్ కాదు, సినిమా స్థాయిని చాటిచెప్పే ఓ భారీ ఈవెంట్. ఈ ఒక్కరోజు కార్యక్రమం కోసమే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా రూ. 20 కోట్లతో భారీ సెట్ నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి’ సెట్టింగ్స్ తరహాలో, సినిమా థీమ్‌ను ప్రతిబింబించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారట. జక్కన్న తన సినిమా రేంజ్‌ను అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌తోనే చూపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
రాజమౌళి ప్లానింగ్ కమర్షియల్‌గానూ మరో స్థాయిలో ఉంది. ఈ భారీ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే ‘జియో హాట్‌స్టార్’ సంస్థకు రికార్డు ధరకు విక్రయించినట్లు సమాచారం. నిర్మాత పెట్టిన ఖర్చులో కొంత భాగాన్ని ప్రకటనల ద్వారానే రాబట్టేలా జక్కన్న పక్కాగా ప్లాన్ చేశారు.
ఈవెంట్ కోసం భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాను ఆకర్షించేలా, సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ సెట్ ద్వారానే చెప్పాలని రాజమౌళి భావిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అగ్ర తారలు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో మహేష్, రాజమౌళితో పాటు వారు కూడా పాల్గొంటారా? ఇటీవల హాట్‌స్టార్‌లో విడుదల చేసిన కొన్ని సెకన్ల ఆడియో గ్లింప్స్‌కు సంబంధించిన పూర్తి వీడియోను ఆ రోజు విడుదల చేస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
మొత్తం మీద, నవంబర్ 15న రాబోయే ఈ ప్రకటన, భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డులకు నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది.
