
టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, ఈ బెర్త్ కోసం ఏటా పెద్ద పంచాయితీ నడుస్తుంది. 2026 రేసు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మొదట, ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి (మన శంకర వరప్రసాద్), ప్రభాస్ (ది రాజా సాబ్), నవీన్ పొలిశెట్టి (అనగనగా ఒక రాజు) మాత్రమే ఉన్నట్లు కనిపించింది.
ఈ ముగ్గురి మధ్య థియేటర్ల సర్దుబాటుకే డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటుండగా, డబ్బింగ్ సినిమాల రూపంలో అదనపు భారం పడింది. తమిళ స్టార్లు విజయ్ ‘జననాయకుడు’, సూర్య ‘కరుప్పు’ చిత్రాలను కూడా తెలుగులో పండగకే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో థియేటర్ల కొరత తీవ్రంగా ఉంది.
ఐదు సినిమాలతోనే రేసు కిక్కిరిసిపోయిందనుకుంటే, ఇప్పుడు మరో రెండు పెద్ద తెలుగు సినిమాలు తెరపైకి వచ్చాయి. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు కూడా సంక్రాంతికే వస్తున్నట్లు ప్రకటించాయి.
నిజానికి, ఈ రెండు చిత్రాలు ఆలస్యం కావడంతో పోటీ నుంచి తప్పుకున్నట్లేనని అందరూ భావించారు. కానీ, శర్వానంద్ టీమ్ అధికారిక పోస్టర్‌ను వదలగా, రవితేజ సినిమా నుంచి లీకులు వస్తున్నాయి. ఇది ట్రేడ్ వర్గాలను గందరగోళంలో పడేసింది.
ఇన్ని సినిమాలను ఒకే వారంలో విడుదల చేయడం అసాధ్యం. బరిలో ముందుగా ఖరారైన చిరంజీవి, ప్రభాస్, నవీన్ చిత్రాలలో ఏదైనా ఒకటి తప్పుకుంటే, ఆ స్లాట్‌ను భర్తీ చేయాలనే వ్యూహంతో ఈ కొత్త చిత్రాల నిర్మాతలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
దీంతో సంక్రాంతి పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. చివరి నిమిషం వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా ఉంది. ఎవరు పోటీలో నిలుస్తారు, ఎవరు తప్పుకుంటారు అనేదానిపై థియేటర్ల బుకింగ్స్ మొదలయ్యాక మాత్రమే పూర్తి స్పష్టత రానుంది.
