
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ‘ప్రతినిధి 2’లో తనతో కలిసి నటించిన శిరీషతో ఆయన ఏడడుగులు నడవనున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉండగా, ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడైన రోహిత్, ‘బాణం’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకుని, ‘సోలో’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘సుందరకాండ’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
నిజానికి, వీరి నిశ్చితార్థం ఎప్పుడో జరిగినా, రోహిత్ తండ్రి అకాల మరణంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు కొత్త ముహూర్తాన్ని నిశ్చయించారు. అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు అజీజ్ నగర్‌లోని ‘ది వెన్యూ’లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ వివాహాన్ని అందరికీ గుర్తుండిపోయేలా నారా రోహిత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్కరోజు వేడుకలా కాకుండా, ఐదు రోజుల పాటు పెళ్లి సంబరాలు జరపనున్నారు. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది.
అక్టోబర్ 26న ఐటీసీ గ్రాండ్ కాకతీయలో పెళ్లి కొడుకు ఫంక్షన్, 28న మెహందీ ఈవెంట్ జరగనున్నాయి. ఈ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
