
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు లీగల్ చిక్కులు తప్పడం లేదు. ఒకవైపు వారు నిర్మించిన ‘డ్యూడ్‘ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ వంద కోట్ల క్లబ్‌కు చేరువవుతుంటే, మరోవైపు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా నుంచి ఊహించని షాక్ తగిలింది.
‘డ్యూడ్’ సినిమాలో తన పాపులర్ సాంగ్ “కరుత మచ్చాన్”ను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ఇళయరాజా మేకర్స్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతున్న సమయంలో ఈ కాపీరైట్ వివాదం తెరపైకి రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
మైత్రీ సంస్థకు ఇళయరాజాతో ఇలాంటి వివాదం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే, అజిత్ హీరోగా వారు నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా విషయంలోనూ ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఆ చిత్రంలో తన మూడు పాటలను అనుమతి లేకుండా వాడటమే కాకుండా, మార్పులు చేశారని ఆరోపించారు.
ఆ వివాదంపై మైత్రీ సంస్థ స్పందిస్తూ, తాము పాటల హక్కులను చట్టబద్ధంగానే మ్యూజిక్ లేబుల్స్ నుంచి కొనుగోలు చేశామని, ఒక్కో పాటకు రూ. 15-20 లక్షలు చెల్లించామని వివరణ ఇచ్చింది. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తుండగానే, ఇప్పుడు ‘డ్యూడ్’ రూపంలో మరో వివాదం చుట్టుముట్టింది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వ్యవహారం తేలకముందే, మరోసారి తన పాటను వాడటంపై ఇళయరాజా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ తాజా ఫిర్యాదుపై మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
వంద కోట్ల సంబరాలకు సిద్ధమవుతున్న ‘డ్యూడ్’ టీమ్‌కు ఈ లీగల్ చిక్కులు ఎలాంటి తలనొప్పి తెస్తాయో చూడాలి. ఒకే ఏడాదిలో, ఒకే లెజెండరీ కంపోజర్‌తో రెండుసార్లు కాపీరైట్ వివాదంలో చిక్కుకోవడం మైత్రీ సంస్థకు ఇబ్బందికరంగా మారింది.
