
నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు, టాలీవుడ్ హీరో, నిర్మాత నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి, తన వివాహ మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్టోబర్ 30న నారా రోహిత్, నటి శిరీష లెల్ల వివాహం జరగనుంది. ఈ సందర్భంగా రోహిత్ గురువారం తెలంగాణ సీఎం కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. తన పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, నారా రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వారి కొత్త జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. రోహిత్ ఇదే సందర్భంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిన్ రెడ్డిలను కూడా తన వివాహానికి ఆహ్వానించారు.
గత ఏడాది అక్టోబర్‌లోనే రోహిత్, శిరీషల నిశ్చితార్థం జరిగింది. అయితే, ఆ తర్వాత రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మరణించడంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు పెద్దల సమక్షంలో అక్టోబర్ 30న వారి వివాహం జరగనుంది.
‘ప్రతినిధి 2’ చిత్రంలో రోహిత్ సరసన హీరోయిన్‌గా నటించిన శిరీష లెల్లతో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి బంధానికి దారితీసింది. గుంటూరు జిల్లా గురజాల మండలం దైదపాలెంకు చెందిన శిరీష, విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి, నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి ప్రవేశించారు.
ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. నారా రోహిత్ స్వయంగా అందరికీ శుభలేఖలు అందిస్తూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
