
తమిళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీ మీనన్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది. కేరళలోని కొచ్చిలో ఆమెపై కిడ్నాప్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారని, గాలింపు కొనసాగుతోందని అధికారిక సమాచారం.
వివరాల ప్రకారం, కొచ్చిలోని ఒక బార్ దగ్గర లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఒక ఐటీ ఉద్యోగి బృందంతో వాగ్వాదానికి దిగారు. గొడవ ఆగిపోయినా, తరువాత వారు ఆ ఉద్యోగిని వెంబడించి, బలవంతంగా కారు లోపలికి ఎక్కించి తీవ్రంగా దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయగా, లక్ష్మీ మీనన్‌పై కేసు నమోదు అయింది.
అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పటికీ ఆమె అందుబాటులో లేకపోవడంతో పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
లక్ష్మీ మీనన్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె 19 ఏళ్ల వయసులోనే కుంకి (తెలుగులో గజరాజు) చిత్రంతో గుర్తింపు పొందింది. పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్, జిగర్ తండా వంటి హిట్ చిత్రాలతో కోలీవుడ్‌లో మంచి పేరు సంపాదించింది. మాతృభాష మలయాళం అయినా, తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ పాపులారిటీ దక్కింది.
