
న్యూస్ డెస్క్: ఆరు నెలల పాటు జట్టులో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాలేకపోయింది. కానీ ఓసారి ఛాన్స్ దొరకగానే చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ మళ్లీ తన విలువను నిరూపించాడు. యూఏఈపై మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.
జట్టులో ఉన్నా ఆడించకపోవడం ఎంత తప్పో తన బౌలింగ్‌తో చెప్పకనే చెప్పేశాడు. 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన ప్రదర్శనతో ఇకపై బెంచ్‌పైన కూర్చోబెట్టొద్దని మేనేజ్‌మెంట్‌కు క్లియర్ సిగ్నల్ ఇచ్చాడు. పాక్ తో ఆడిన మ్యాచ్ లో కూడా పరవాలేదు అనిపించాడు.
ఇంతకాలం వన్డే, టీ20ల్లో ఉన్నా ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇంగ్లాండ్ సిరీస్‌లో కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. ఐదు టీ20ల్లో ఒక్కదానికీ ఛాన్స్ రాలేదు. టెస్టు సిరీస్‌లో స్క్వాడ్‌లో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా అసహనం చూపకుండా కష్టపడి ప్రాక్టీస్ చేసిన కుల్‌దీప్ ఇప్పుడు తన ఫలితాన్ని రుజువు చేశాడు.
అతని బలం ఫ్లైటెడ్ డెలివరీ. బ్యాటర్లను బుట్టలో వేసే ఆ అస్త్రంతో యూఏఈ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పేశాడు. క్యాచ్, ఎల్బీ, బౌల్డ్ అన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రత్యర్థిని ఊరించేలా బంతులు వేయగలిగిన కుల్‌దీప్ యాదవ్, రాబోయే మ్యాచ్‌లో కూడా అభిమానుల అంచనాలు మరింత పెంచేశాడు. స్పిన్‌కు అనుకూలమైన దుబాయ్ పిచ్‌లో అతని బౌలింగ్ ప్రధాన ఆయుధం అవుతుందని క్లియర్‌గా కనబడుతోంది.
మొత్తానికి, ఆరు నెలల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ఒక్క ఛాన్స్ కుల్‌దీప్ యాదవ్ కెరీర్‌లో మరో మలుపు కావడం ఖాయం. ఇకపై అతడిని బెంచ్‌లో ఉంచడం మేనేజ్‌మెంట్‌కి కష్టమే.