
న్యూస్ డెస్క్: అమెరికాలో తెలంగాణ యువ టెకీ మృతి చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు ఇది “ఆఫీసర్ ఇన్వాల్వ్డ్ షూటౌట్” అని చెప్పినా, కుటుంబం మాత్రం ఇది జాతివివక్ష కారణంగానే జరిగిందని ఆరోపిస్తోంది.
నిజాముద్దీన్ (30) సాంటా క్లారాలోని ఒక టెక్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. తన రూమ్‌మేట్‌తో వివాదం జరిగి సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ, చివరికి తనపైనే పోలీసులు కాల్పులు జరిపారని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.
ఈ ఘటన వెనుక జాతివివక్ష ఉందని ఆయన లింక్డిన్‌లో రాసిన పోస్ట్‌లు చూపిస్తున్నాయని బంధువులు చెబుతున్నారు. “అమెరికాలో శ్వేత జాతి ఆధిపత్యం, జాతి వివక్షను ఎదుర్కొంటున్నాను” అని ఆయన బహిరంగంగా రాసిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఫుడ్ పాయిజనింగ్, బలవంతపు గృహనిర్వాసం, వేతన మోసం వంటి సమస్యలను కూడా నిజాముద్దీన్ తన పోస్ట్‌లలో ప్రస్తావించాడు. కుటుంబ సభ్యులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇది కేవలం ఘర్షణ కారణం కాదు, జాతివివక్షకు తార్కాణమని చెబుతున్నారు.
ఇక హైదరాబాద్‌లోని ఆయన తండ్రిని కలిసిన రాజకీయ నాయకులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నారు.
ఈ ఘటనపై ఇంకా అధికారికంగా భారత విదేశాంగ శాఖ స్పందించకపోయినా, తెలంగాణలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో ఉన్న టెకీలు భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
