
అంచనాలు లేకుండా వచ్చిన కాంతార అద్భుతం సృష్టించింది. కానీ ఇప్పుడు వచ్చిన కాంతార చాప్టర్ 1 ట్రైలర్ మాత్రం భారీ అంచనాలు పెంచింది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మూడున్నర నిమిషాల ట్రైలర్‌లో రిషబ్ శెట్టి మరోసారి కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ప్రేమ, ద్రోహం, యుద్ధం.. చివర్లో దేవుడి దర్శనం ఇవే కథకు బలమైన హైలైట్స్‌గా నిలిచాయి. విజువల్‌గా ఈ సినిమా కాంతార కంటే మరింత గ్రాండియర్‌గా అనిపిస్తోంది.
రిషబ్ తన పాత్రలో మళ్లీ అదరగొట్టాడు. ముఖ్యంగా ఈసారి ఈశ్వరుడి పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కలిగిస్తోంది. కాంతారలో దైవతాన్ని సాధారణ కథలో మిళితం చేసిన రిషబ్, ఈసారి కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేశాడని ట్రైలర్ చెబుతోంది.
సినిమాలో భూమి, మట్టి, సంప్రదాయాలపై మరోసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కథ వేరే యుగం నేపథ్యంతో సాగుతుండటం వల్ల కొత్తగా అనిపిస్తోంది. స్థానిక సంస్కృతి, విశ్వాసాలతో మిళితమైన ఈ కథ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకోబోతోందని ఫీలవుతున్నారు.
మేకింగ్ పరంగా కూడా ఈసారి భారీగా ఖర్చు పెట్టారు. సినిమాకు వచ్చిన క్రేజ్‌ను అందుకోవాలంటే రిషబ్ మరో అద్భుతం చేయాల్సిందే. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం సినిమా రేంజ్‌పై అంచనాలు పెరిగిపోయాయి.
