
న్యూస్ డెస్క్: ఆసియా కప్ ఉత్సాహం ఇంకా చల్లారకముందే మళ్లీ భారత్ పాకిస్థాన్ క్రికెట్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. అక్టోబర్ 5న శ్రీలంకలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఇటీవలే పురుషుల ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌ను వరుసగా మూడోసారి ఓడించింది. అంతేకాదు పాక్ క్రికెట్ బోర్డు అధినేత చేతుల నుంచి ట్రోఫీ స్వీకరించకుండా టీమ్ ఇండియా నిరాకరించింది. అదే స్ఫూర్తితో మహిళల జట్టు కూడా పాక్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయకపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
ఈసారి ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలి మ్యాచ్ గువాహటిలో భారత్-శ్రీలంకల మధ్య జరగనుంది. భారత్ ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలవలేకపోయింది. 2017లో ఫైనల్ వరకు చేరినా, టైటిల్ చేజారిపోయింది.
మొత్తం 12 టోర్నీలలో ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి. ఈసారి సొంత గడ్డపై ఆడుతున్న భారత్ ఫేవరెట్‌గా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
గత మూడు ఆదివారాల్లో వరుసగా పాకిస్థాన్‌తో తలపడి గెలిచిన టీమ్ ఇండియా.. ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
దేశంలో ఇటీవల ఉగ్రవాద దాడులు, పాక్‌తో ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు రాజకీయ రంగు కూడా ఎక్కువగా చేరింది. కాబట్టి భారత్-పాక్ పోరులో క్రికెట్‌తో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా దావానలంలా రగలబోతున్నాయి.